05-12-2025 12:57:19 AM
కోహ్లీ, రోహిత్‌లపై బీసీసీఐ క్లారిటీ
ముంబై, డిసెంబర్ 4 : భారత క్రికెట్‌లో ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఆటతోనే కాకుండా మిగిలిన విషయాల్లో వీరి గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రోకో జోడీని దేశవాళీ క్రికెట్ ఆడాలని కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి కోహ్లీ అయిష్టంగానే విజ య్ హజారే టోర్నీ ఆడేందుకు ఒప్పుకున్నాడని కూడా ప్రచారం జరిగింది.
గత కొన్ని రోజులుగా గంభీర్, అగార్కర్‌లతో రోహిత్, కోహ్లీలకు పడడం లేదన్న వార్తల నేపథ్యం లో తాజా పరిణామాలు గందరగోళాన్ని మ రింత పెంచాయి. అయితే ఈ వార్తలపై బీసీసీఐ స్పందించింది. విజయ్ హజారే టోర్నీ ఆడమని రోహిత్, కోహ్లీలపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవాళీ క్రికెట్ ఆడడం అనేది పూర్తిగా వారిద్దరూ తీసుకున్న నిర్ణయంగా చెప్పుకొచ్చారు.
కాగా వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ అగార్కర్, గంభీర్ సీనియర్ ప్లేయర్స్‌కు స్పష్టం చేశారు. ఫ్యామిలీతో కలిసి లండన్‌లో సెటిలయిన వి రాట్ ప్రస్తుతం భారత్‌కు వన్డే సిరీస్‌లు ఉన్నప్పుడు మాత్రమే జట్టుతో చేరుతున్నాడు. గంభీర్ కోహ్లీపై అసహనం వ్యక్తం చేసినట్టు, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన బీసీసీఐ సెలక్టర్ ప్రగ్యాన్ ఓజాకు ఆ బాధ్యత అప్పగించింది. ఓజాతో మాట్లాడిన తర్వాతే కోహ్లీ విజయ్ హజారే టోర్నీ ఆడేందుకు అంగీకరించాడు.