30-01-2026 12:33:40 AM
చౌటుప్పల్, జనవరి 29: చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్ గుత్త వెంకట్రాంరెడ్డి తో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు .ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతుందో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి నామినేషన్ పత్రాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు .నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం జాగ్రత్తగా చేయాలని ఎక్కడ జాప్యం జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు .ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవిన్యూ అధికారి అంజయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.