27-08-2025 01:56:02 AM
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్‌పాల్‌రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతికిరణ్, సాంచీరాయ్, మేఘన కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 29న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను నటుడు వశిష్ట ఎన్ సింహా మీడియాతో పంచుకున్నారు. “త్రిబాణధారి బార్బరిక్’ టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉంది.. వెంటనే కథను వినాలనిపించింది.
ఇలాంటి మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇంకా రావాలి. కథ మన చుట్టూ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మా మూవీ పూర్తిగా మైథలాజికల్ జానర్‌లో ఉండదు. బార్బరికుడు చుట్టూ కథ ఉండదు. ఆ థీమ్ నుంచి తీసుకుని కథను అల్లుకున్నారు. ఇప్పటివరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ, ఇందులో మధ్యతరగతి అబ్బాయి పాత్రను పోషించాను. సమాజాన్ని ప్రతిబింబించే చిత్రమిది. ప్రతి పాత్రకూ బార్బరికుడి థీమ్‌కు లింక్ ఉంటుంది.
చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు. జవాబుదా రీతనం, బాధ్యతల గురించి చక్కగా చూపించారు. ఇది నార్త్, సౌత్ అని కాకుండా ప్రతి మనిషికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో తీశాం. షూటింగ్‌లో ప్రతిరోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది. చాలా వరకు నైట్ షూట్స్, రెయిన్ షాట్స్ ఉంటాయి. దర్శకుడు, కెమెరామెన్ చాలా కష్టపడ్డారు. ప్రతి చిన్న విషయాన్నీ వదిలిపెట్టేవారు కాదు. అలా చాలా సార్లు ఎన్నో టేక్స్ చేసేవాళ్లం. సమాజంలో రకరకాల ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాటికి మా ‘బార్బరిక్’ సమాధానాలు చెబుతుంది” అన్నారు.