24-09-2025 01:28:58 AM
మాజీమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్న రేషన్ డీలర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : రేషన్ డీలర్ల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శిం చారు. నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకపోవడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో ఆయనను రేషన్ డీలర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లా డుతూ... పేదల ఆకలి తీరుస్తున్న రేషన్ డీలర్లు పాలకుల తీరుతో పస్తులండే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదని మండిపడ్డారు.
ఎన్నికల ముందు అబద్ధ్దపు హామీల తో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారని విమర్శించారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, రాష్ర్ట ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.