calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక థ్రిల్లర్ జానర్‌లో..

04-12-2025 01:56:55 AM

ఇటీవల ‘మాస్ జాతర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆయన కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా రూపొందిస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కథను నమ్మి సినిమా చేసే డైరెక్టర్లలో ఒకరుగా శివ నిర్వాణకు టాలీవుడ్‌లో మంచి పేరుంది. చివరగా ఆయన విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా తెరకెక్కించారు.

ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ, రవితేజతో చేసే సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉందని టాక్. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ ఇదని సమాచారం.

రవితేజ సినిమా అనగానే సినీప్రియులకు మాస్ అప్పీల్, ఎనర్జిటిక్ డ్యాన్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలే గుర్తుకు వస్తాయి. అయితే, రవితేజ ఈసారి రూటు మార్చి థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్‌లో ఇప్పటికే రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం వచ్చింది.

డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ ఈ సంస్థలో నిర్మించిందే. ఈ ముగ్గురి కాంబోలో రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటోందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారని వినికిడి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.