calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద్ మఠ్ పుస్తకంలోని కథతో..

04-12-2025 01:55:46 AM

‘కాంతార’ విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ఇటీవల ‘కాంతార: చాప్టర్1’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో అనేక సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రిషబ్ తర్వాత ఏ సినిమాకు పనిచేస్తారనే సందేహం అందరిలో నెలకొని ఉంది. అయితే, రిషబ్ తాజాగా ‘కాంతార’ ప్రీక్వెల్ ప్రమోషన్స్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్టు ‘జై హనుమాన్’ అని ప్రకటించారు. వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం రిషబ్ ఐదు నెలల పాటు డేట్స్ కేటాయించారు.

ఇది పూర్తయిన వెంటనే బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాను పట్టాలెక్కిస్తారు. ఇదిలావుండగా రిషబ్ చేయబోయే సినిమాల గురించి ఇప్పుడు మరో ఆసక్తికర వార్త వినవస్తోంది. ఆయన హీరోగా ఓ సినిమా రూపొందించడానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

దర్శకుడు అశ్విన్ గంగరాజు దీన్ని తెరకెక్కించనున్నారు. ఇదొక యోధుడి కథ అని, చరిత్రలో మరుగున పడిపోయిన ఓ పోరాట గాథ అని తెలుస్తోంది. బంకించంద్ర చటర్జీ రచించిన ‘ఆనంద్ మఠ్’ అనే పుస్తకం నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ కథను రూపొందించనున్నారట. ఈ సినిమా షూటింగ్ 2026 వేసవిలో ప్రారంభిస్తారని సమాచారం.