06-05-2025 12:00:00 AM
జగిత్యాల, మే 5 (విజయక్రాంతి) : ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం నూతనంగా నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బి.ఎం.వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల సీఎంను కలిశారు.
తమపై ఎంతో నమ్మకంతో అడ్వుజరీ కమిటీలో స్థానం కల్పించినందుకు సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి ఈ కమిటీ అధ్యయనం చేసి, నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుందని కమిటీ చైర్మన్ డా. వినోద్ కుమార్ అన్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి వివరించారు.