02-12-2025 12:18:28 AM
ఖమ్మం టౌన్, డిసెంబర్ 1 (విజయ క్రాంతి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం సంజీవ్ రెడ్డి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు నూతన అధ్యక్షుడికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు.
ఇదే విధంగా ఖమ్మం జిల్లాలో నూతన అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పార్టీకి అట్టిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.