05-12-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 4, (విజయక్రాంతి):జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు2025 నేపధ్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణను మరింత ప్రభావవంతంగా నిర్వహేందుకు నియమితులైన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్సర్వర్ పి. లావణ్య గురువారం ప్రత్యేక పర్యటన చేపట్టారు. ఆమె మొరంపల్లి బన్జార్ (SST) ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్, యెడుల్ల బయ్యారం చెక్ పోస్ట్లను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన తనిఖీ వ్యవస్థ, వాహనాల పరిశీలన, నగదువస్తువుల కదలికలపై అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను విపులంగా పరిశీలించారు.
సంబంధిత అధికారులకు దోహదపడే విధంగా ఎన్నికల నిర్వహణ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.తరువాత ఆమె పినాపాక, మనుగూరు, కరకగూడెం, ఆశ్వాపురం మండలాల్లో పనిచేస్తున్న ఎన్నికల వ్యయ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల వ్యయ నియంత్రణ పారదర్శక ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
వ్యయ పర్యవేక్షణ బృందాలు నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి ఆల స్యం లేకుండా, అత్యంత నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనుమానాస్పద లావాదేవీలు, నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాపై కఠిన నిఘా పెట్టాలని, ప్రజల సహకారాన్ని పెంపొందించేలా అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎక్స్పెండిచర్ అబ్సర్వర్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో సమన్వయం, సమాచార వినిమయం, చెక్పోస్టులలో అప్రమత్తత వంటి అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.