calender_icon.png 27 July, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్న అధికారులు..

27-07-2025 05:41:37 PM

అక్రమార్కులకు సహకరించే అధికారులను వదలం...

భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు...

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు(MLA Kokkirala Premsagar Rao) చేస్తున్న అవినీతికి అధికారులు కొమ్ముకాస్తున్నారని, దానికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) అన్నారు. ఆదివారం తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశం రాజకీయాల కోసం కాదని, అధికారులను ఆలోచించమని చెప్పడానికి పెట్టానన్నారు. చేయని పనులకు బిల్లులు చేయాలని, చేసిన పనికంటే ఎక్కువ బిల్లులు ఇవ్వమనడంతో తన ఉద్యోగం పోతుందనే భయంతోనే మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవడానికి కారణమని ఈ ప్రాంత ప్రజలు కోడై కూస్తున్నారన్నారు. కొంత మంది అధికారులు రాబోయే ఆపదను ముందే గ్రహించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, మరికొంత మంది ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని, భవిష్యత్తులో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి ఖాయం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, మంచిర్యాల నియోజక వర్గంలోనూ ప్రేమ్ సాగర్ రావు ఓటమి ఖాయం అయిపోయిందని మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు ఆరోపించారు. నియోజక వర్గంలో మితి మీరిన అవినీతి, దాడులు, ప్రతి వెంచర్ దగ్గర డబ్బులు వసూలు, తప్పుడు కేసులు, భూముల విషయంలో తలదూర్చడం వంటివి ఆయన ఓటమికి కారణాలవుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే అని, మంచిర్యాల నియోజకవర్గంలో గెలిచేది కూడా గులాబీ పార్టీయేనన్నారు. ప్రతిపక్షంగా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, మా నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవడమే మా బాధ్యత అని అన్నారు.

అక్రమార్కులకు సహకరించే అధికారులను వదలం...

అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలమని మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు పేర్కొన్నారు. గోదావరి నదిలో ఉన్న ఇసుకను, మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే వారికి సహకరించిన అధికారులను, ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూలగొట్టడానికి సహకరించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలతో కట్టిన వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్ జంక్షన్ లను అక్రమంగా కూలగొట్టిన అధికారులు జీవితాంతం చట్టపరంగా బాధపడేలా చేస్తామన్నారు. తప్పులు చేసి రిటైర్ అయిపోతాం, మాకేమవుతుందనుకునే అధికారులకు భవిష్యత్తులో పెన్షన్ కూడా రాకుండా అవుతుందన్నారు.

తప్పుడు కేసులు నమోదు చేసిన వారు సైతం...

బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులు సైతం భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 20న బెల్లంపల్లి చౌరస్తాలో ధర్నా చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రజలకు అసౌకర్యం కలిగిందని 30 మంది మీద కేసు పెట్టారని, అదే రోజు అక్కడ కాంగ్రెస్ వారు ధర్నా చేస్తే వారి మీద కేసు పెట్టని అధికారులు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు చట్టపరంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీఆర్ఎస్ నాయకులు మందిపెల్లి శ్రీనివాస్, గడప రాకేష్, బేర సత్యనారాయణ, అంకం నరేష్, గొల్ల శ్రీనివాస్ తోపాటు ముగ్గురిపై, సిరాజ్, కందుల ప్రశాంత్, దగ్గుల మధు, రావుల రాజేశం, అక్కల రవితో పాటు ఏడుగురిపై, ఓరగంటి  శ్రీకాంత్, మల్లేష్ రాపల్లి, నక్క తిరుపతిలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టేదిలేదన్నారు.

ఇంట్లో కూర్చుంటారా.. న్యాయంగా పని చేస్తారా...

వచ్చే ఎన్నికలలో ప్రేమ్ సాగర్ రావు ఓడిన తర్వాత హైదరాబాద్ కు పరిమితం అవుతారు కానీ ఇవాళ తప్పు చేసిన అధికారులు ఎక్కడికి పోతారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అధికారులను ప్రశ్నించారు. తప్పుడు పనులకు కొమ్ము కాస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. మూడేండ్లు ఇక్కడ పనిచేసి మిగిలిన సర్వీస్ అంతా ఇంట్లో కూర్చుంటారో లేక న్యాయంగా మీ డ్యూటీ మీరు చేసుకుంటారో.., నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ, బీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.