16 June, 2026 | 3:41 AM

జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి

16-06-2026 02:25 AM

పెండింగ్ దరఖాస్తులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు (మహబూబాబాద్) జూన్ 15 (విజయక్రాంతి): ములుగు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, పెండింగ్ దరఖాస్తులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తన ఛాంబర్లో రెవెన్యూ అధికారులతో భూ భారతి, భూ సేకరణ, రామచంద్రపురం భూముల రీ సర్వే, మీసేవ ధ్రువీకరణ పత్రాల మంజూరు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రామచంద్రపురం భూముల రీ సర్వే అంశంపై పెండింగ్లో ఉన్న భూ వివాదాలు, సర్వే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు స్పష్టమైన హక్కులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మీసేవ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండకూడదని, ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ సేవలను నిర్దిష్ట గడువులో అందించేలా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పురోగతిపై సమీక్షిస్తూ, సంబంధిత అధికారులు సమగ్రంగా పనిచేసి అన్ని వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సేవల అమలు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు..ఈ సమావేశంలో ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్‌ఓ రవికుమార్, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, పర్యవేక్షకులు మంజుల, మహేష్ బాబు, అన్ని మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.