16 June, 2026 | 4:27 AM

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి

16-06-2026 02:26 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నిరంతరం పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కే. అనిల్ కుమార్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిబంధనల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

విద్యాలయాల్లో సమస్యలు ఉండొద్దు.. 

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని, మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎక్కడా రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు ప్రధానంగా భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ పథకం, స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు.

ప్రజావాణి కార్యక్రమంలో 215 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల వారీగా కంప్యూటరైజ్ చేసి, సంబంధిత అధికారులకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా వీటికి పరిష్కారం చూపి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు,  కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని విభాగాల అధికారులు,  డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.