యాప్ ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం
మహబూబాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): వానాకాలం పంటల సాగు చేపట్టిన రైతులకు ఎరువుల పంపిణీ కోసం యాప్ ప్రారంభించారు. పూర్తిగా యాప్ ద్వారానే యూరియా పంపిణీ చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. యాప్ మినహా నేరుగా ఎక్కడ కూడా యూరియా అమ్మకాలు జరగవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంట ల సాగు తీరుపై కార్యాచరణ రూపొందించా రు. జిల్లావ్యాప్తంగా 4,78,085 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశాలు ఉన్న ట్లు పంటల ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు జిల్లాలోని రైతులకు పంటల సాగుకు 43,311.78 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని ప్రణాళిక ఖరారు చేశారు.
ఇందులో ప్రధానంగా 2,35,163 ఎకరాల్లో వరి, 1,01,716 ఎకరాల్లో పత్తి, 73,760 ఎకరాల్లో మొక్కజొన్న, 38,819 ఎకరాల్లో మిర్చి పంటతోపాటు ఇతర పంటలను సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ వానాకాలం పంట సాగు విస్తీర్ణం అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వా రా, ప్రైవేటు డీలర్ల ద్వారా ప్రత్యేకంగా రూ పొందించిన యాప్ ఆధారంగా యూరియా పంపిణీ చేసే విధంగా బుకింగ్ ప్రారంభించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా యాప్ బుకింగ్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రైతులు వ్యవసాయ శాఖ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు, మీసేవ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్ను ఏ ఈ వోల వద్ద ధ్రువీకరించుకోవాలి. దీని ఫలితంగా ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇప్పటికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తీసుకొని రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన యూరియా విడతలవారీగా అందించడం జరుగుతుంది. ఆ మేరకు రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం పంటల సాగుకు, దీర్ఘకాలికంగా ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
బీ.వెంకన్న, ఏవో, కేసముద్రం






