calender_icon.png 21 November, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ సాగు పెంచాలి

21-11-2025 12:43:39 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, నవంబర్ 20 (విజయక్రాంతి) : జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా సహకార అధికారితో కలిసి డివిజనల్ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుతో కలిగే లబ్ధిపై రైతులకు అవగాహన కల్పించాలని, జిల్లాలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438 ఎకరాలలో సాగు జరుగుతుందని, సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేసి మిగతా లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ సాగులో ఆదాయం అధికంగా ఉంటుందని, ఈ విషయంపై రైతులకు వివరించి పంట సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.

రైతు సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి వరి ధాన్యం, పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి 6వ జల పురస్కారాలలో భాగంగా మంచిర్యాల జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకుగాను జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.