10-08-2024 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
అవి నేను చింతపల్లి హైస్కూలులో చదివే రోజులు. అది అసలే, కటిక వేసవి. ఎండలు మండి పోతున్నాయి. బడిలో ఉన్నంతసేపు ఇబ్బందేమీ లేదు. కానీ, బయట అడుగు పెడితే చాలు, పాదాలు చుర్రుమంటున్నాయి. మధ్యాహ్నం ‘బడి గంట ఎప్పుడు మోగుతుందా? ఎప్పుడు అద్దె గదికి వెళ్లి ఆకలి తీర్చుకుందామా?’ అని ఆశగాఎదురు చూస్తున్నాను. కాసేపట్లోనే పగటి గంట మోగింది. అందరు పిల్లలతోపాటు నేనూ బడి బయటకు నడిచాను. ఎదురుగా ఎండలో ఒక వృద్ధుడు కనిపించాడు.ఒక చేతిలో కర్ర, మరో చేతిలో చిన్న సంచి. తలమీద తెల్లని రుమాలు. సూర్యుని ప్రతాపానికి అవన్నీ తళుకులీనుతూ ఉన్నాయి.
పెద్దాయన వంగి, మెల్లమెల్లగా నడుస్తున్నాడు. ఆయాస పడుతున్నాడు. ముఖం పాలిపోయి ఉంది. చెమటలు వచ్చా యి. ఎముకలు తేలా యి. నుదుట ఎర్రని బొట్టు పెట్టుకున్నాడు. బాగా బక్క పలుచని దేహం. కొద్ది సేపట్లోనే అతనెవరో నేను గుర్తు పట్టాను. ఆయన మా ఊరి లక్ష్మయ్య తాత. అంతటి ఎర్రటి ఎండలో ఆ పెద్దమనిషిని చూడగానే నాకు పాపమనిపించింది. వెంటనే స్కూలు మెట్లు దిగి, తన దగ్గరగా వచ్చి ఎదురుగా నిల్చొని ఆత్మీయంగా పలకరించాను.
“లక్ష్మయ్య తాతా! ఎక్కడికి బయల్దేరావు?”
అతను కూడా నన్ను వెంటనే గుర్తు పట్టినట్టున్నాడు.
“నువ్... మా వూరి పిలగాడివి కదా?.. మా బిడ్డను చూద్దామని బయల్దేరాను. ఇక్కడికి ఒక కోసు దూరం లో దాని ఊరు..” అన్నాడు.
కొల్కులపల్లి మా ఊరు. చింతపల్లికి ఆరు మైళ్ల దూరం. ఇంకా ఒక కోసు దూరం నడిస్తే గాని ఆ తాత కన్నబిడ్డ ఊరు రాదు. మావి ఊళ్లో పక్కపక్కన ఇండ్లే కనుక, నేను తాత పరస్పరం వెంటనే గుర్తు పట్టుకోగలిగాం. ఇరువురం ఊళ్లో చాలాసార్లు కలుసుకున్న వాళ్లమే. తాత మాటలకు నాకు ఆశ్చర్యమేసింది. ఇంత ఎండలో పాపం, ఇంకా కోసు దూరం నడవాలి. మిట్టమధ్యాహ్నం. ‘కడుపు కాలుతూ ఉండవచ్చు’ అనుకు న్నాను. అలా తాతను వదిలేసి వెళ్లాలని అనిపించలేదు నాకు.
“తాతా! ఇంత ఎండలో ఏం పోతావు? ఇక్కడ దగ్గరే నా గది ఉంది. కొద్దిసేపు నీడ పట్టున విశ్రాంతి తీసుకొని వెళ్దువుగానీ రా..” అన్నాను తన చెయ్యి పట్టుకొని.
“ఆ.. నా విశ్రాంతికేముందిగాని, ఆకలేస్తుంది బిడ్డా. ఒక్క బుక్క అన్నం పెడితే చాలు. తిని.. బయల్దేరుతాను” అన్నాడు ఆయాసంగానే. నాకు పాపమనిపించింది. అన్ని కోసుల దూరం నుండి నడుస్తూ వచ్చాడు. ఎప్పు డో పొద్దుటనగా బయల్దేరి ఉంటాడు. ఆకలి వేయకుండా ఉంటుందా! నేను మరేమీ ఆలోచించకుండా అన్నాను. “అయితే పద, లక్ష్మయ్య తాతా! నా రూము చాలా దగ్గరేలే..”అతణ్ణి తీసుకొని గదికి వెళ్లాను. లక్ష్మయ్య కాళ్లు కడుక్కుని గడపలోకి వచ్చి కూర్చున్నాడు.
అసలే అది స్కూలు జీవితమాయె. నా పరిస్థితి దయనీయమే. అప్పట్లో నాకు పచ్చళ్లే పంచభక్ష్య పరమాన్నాలు. చింతపండు పులుసు అమృతం వంటిది. ఉదయం మూడు అర్ద పావుల బియ్యం వండుకొంటాను. అందులోను కట్టెల పొయ్యి వంట. నేనే స్వయం గా చేసుకొనే వాణ్ణి. నా చేతి వంట కాబట్టి, నాకెంతో ప్రియంగానే ఉండేది. నా తిండి తిప్పలును చెప్పడానికి అప్పట్లో సరదాగా ఓ పద్యం కూడా రాసి చదువుకొనే వాణ్ణి. దానిని ఆ తర్వాత ఎందరికో చదివి వినిపించాను కూడా.
“చింతకాయ తొక్కు చిన్న గ్లాసెడు చల్ల
దోసకాయ తొక్కు దోస పొడియం
అప్పుడప్పుడు పులుసందు బాటున నున్న
పూర్తి యగును నాదు భోజనమ్ము.”
పచ్చడి మెతుకులే పరమాన్నం
లక్ష్మయ్య తాతకు పూర్తిగా ఆకలి తీరాలంటే నేను ఆ పూట పస్తులుండవలసి వస్తుంది. నాకూ ఆకలిగానే ఉంది. కనుక, పొద్దున తినగా మిగిలిన అన్నం ఇద్దరం చెరిసగం పంచుకున్నాం. పాపం, లక్ష్మయ్య చింతకాయ పచ్చడి కలుపుకొని తిన్నాడు. నా క్లాస్‌మేట్‌ను అడిగి తెచ్చిన పచ్చిపులుసుతో భోజనం ముగించాడు. లక్ష్మ య్య తాతకు నా ఆతిథ్యంతో ఆకలి తీరిందని చెప్పలేను. కానీ, ‘ఒక్క బుక్క’ అన్న మాట నన్ను కట్టి పడేసింది. ‘కడుపు నిండకున్నా కొద్దిగానైనా ఆకలి తీరుతుంది కదా’ అనిపించింది. అందుకే, అతణ్ణి రూముకు తీసుకొని వెళ్లాను. ఊళ్లో మా ఇంటి పక్కనే ఉంటాడు కనుక నాకు అతనితో మంచి పరిచయం ఉంది.
ఎలాగైతేనేమి ఒక విద్యార్థిగా ఉంటూ ఒకరి ఆకలి తీర్చానన్న తృప్తి కలిగింది. భోజనం తర్వాత లక్ష్మయ్య తాత కృతజ్ఞతా పూర్వకంగా నాకు నమస్కరించాడు. కర్ర సాయంతో నిలబడే ఆ వ్యక్తి ఆశ్చర్యంగా కర్ర లేకుండానే నిలుచుం డి, చేతులు జోడించి నమస్కరించిన దృశ్యం ఈనాటికీ నా హృదయం ఫలకం నుంచి చెదిరి పోలేదు. లక్ష్మయ్య తన బిడ్డ ఊరికి వెళితే, నేను బడికి వెళ్లాను. ఇది ఇక్కడితో ముగిసింది. కానీ, ఒక్క బుక్క బంధం ఆ తాతను ఎంతగా కట్టి పడేసిందో నాకు ఆ తర్వాత తెలిసింది. ఈలోపే విధి వక్రించింది. జరగరాని సంఘటనకు తెరతీసింది. నేను పెట్టిన ఆ కాసింత అన్నం ముద్ద ఆ పెద్ద మనిషిని అంతగా సంతోషపెట్టిందంటే ఆ చిన్నతనంలో నమ్మలేకపోయాను.
వారానికో, రెండు వారాలకో సరిపడే బియ్యం, పచ్చళ్లను నేను ఊరికి వెళ్లి తెచ్చుకోవాలి. వంటకట్టెలు కూడా నేను మా ఊరినుంచే తెచ్చేవాణ్ణి. మా నాన్న కట్టెలు ముక్కలు చేసి సిమెంటు బస్తాలో పెట్టేవారు. దాన్ని అమ్మ గేటు (బస్టాండు) దాకా తెచ్చిచ్చేది. పదో తరగతి దాకా నా వంట కట్టెల పొయ్యిమీదే. డిగ్రీ పూర్తయ్యే వరకూ బత్తీల స్టౌ మీద, పట్నం కాబట్టి. జీవిత భాగస్వామి వచ్చాక బర్నల్ స్టౌ వాడాం. కొడుకులు, కోడళ్ల కాలంలో గ్యాస్ స్టౌ వచ్చింది.
ఒక వారం తర్వాత బడికి సెలవులు వచ్చాయి. యథావిధిగా ఎర్ర బస్సెక్కి ఊరికి బయల్దేరాను. అప్పటికి లక్ష్మయ్య తాత నా వద్దకు వచ్చి వారం పది రోజు లు మాత్రమే అయ్యింది. ఆ విషయం నేను మరిచిపోయాను. కానీ, కాలం నాకు మళ్లీ గుర్తు చేస్తుందని ఊహించలేదు. మా ఊరి గేటుదగ్గర దిగి, ఊళ్లోకి నడక ప్రారంభించాను. శివాలయం దాటి ఇంటిదారి పట్టా ను. అంతే! పెద్దగా హృదయ విదారకంగా ఒక మహిళ ఏడుపు వినిపించింది. దగ్గరగా వెళ్లి చూస్తే అది లక్ష్మ య్య ఇంటినుంచే. ఒక్క క్షణం లక్ష్మయ్య తాత ఇంటి ముందు ఆగాను. ఆయన భార్య పెద్దమ్మ నన్ను చూసి బోరుమంది. అక్కడి వాతావరణానికి పిల్లవాడినైన నాకూ ఏడ్పు ఆగలేదు. కళ్లనీళ్ల పర్యంతమయ్యాను.
“మా ముసలాయన పోయిండు బిడ్డా. పోయేటప్పుడు నిన్ను గుర్తు చేసిండు. ఒక్క బుక్క అన్నం పెట్టిన వంట. ఆకలి తీర్చినవంట. నీకెంతో పుణ్యమట.” అం టున్న పెద్దమ్మ మాటలు నా చెవులకు వినపడుతూనే ఉన్నాయి. అంటే, లక్ష్మయ్య తాత చనిపోయాడా?! నమ్మాలనిపించలేదు. కాలం ఎంత కర్కషమైందో అంత చిన్నవయసులోనే నాకు అర్థమైంది. అందుకే, ‘బతికినంత కాలం మంచిపనులే చెయ్యాలి నాన్నా..’ అంటూ అమ్మ తర్వాత అన్న మాటలు అక్షర సత్యాలే అనిపించాయి.
“ఒక్క బుక్క తిని పోతాను..” అన్న లక్ష్మయ్య తాత ఆ చివరి మాటలు నా మనసులో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నాకెంత పుణ్యం వచ్చిందో చెప్పలేను కానీ, ఆ పెద్ద మనిషికి అప్పటి ఆకలిని కొద్దిగానైనా తీర్చానుకదా అన్న తృప్తి నాకు మిగిలింది.
వ్యాసకర్త సెల్: 9885654381