02-12-2025 12:51:52 AM
తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి
సూర్యాపేట, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీ ఆర్ ఎస్ గత 10 సంవత్సరాలు పాలించిన సమయంలో నిజమైన పేదవారికి ఇల్లు అందలేదన్నారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి, పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతుందన్నారు. ఆర్ధికంగా బలహీనమైన రాష్ట్రాన్ని తిరిగి పటిష్టం చేస్తున్న ప్రభుత్వం రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్, ఉద్యోగాల భర్తీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ గతంలో నాసిరకం చీరలు పంచగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందజేస్తోందన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, పార్టీకి చెందిన అభ్యర్థులనే గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.