26-08-2025 12:46:40 AM
కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులున్నా పట్టించుకోరు. నాయికా ప్రాధాన్య చిత్రాల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ విమర్శిస్తుంటారు’ అంటూ అసహనానికి గురైంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, సోమవారం మూవీటీమ్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో ఆ చిత్ర కథానాయకి అనుపమ పరమేశ్వరన్ విమర్శలపై స్పందించింది.
“నేను నటించిన సినిమాల్లో ‘పరదా’ నాకు చాలా ఇష్టం. కొందరు వినోదాత్మక చిత్రాలను ఇష్టపడితే, మరికొందరు కథాబలం ఉన్న ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటారు. ఎవరి అభిరుచి వాళ్లది, ఎవరి అభిప్రాయం వాళ్లది. అయితే, కొందరు మా ‘పరదా’ని ప్రయోగాత్మక చిత్రం అంటూనే అందులో తప్పులు వెతుకుతున్నారు. సినిమానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ కొత్తగా ప్రయత్నించేవారిని విమర్శిస్తుంటారు. కమర్షియల్ చిత్రంలో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరు. నాయికా ప్రాధాన్య చిత్రాల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే చాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు ప్రోత్సహిస్తే ఇలాంటి కొత్త కంటెంట్ చిత్రాలు ఇంకా వస్తాయి” అని తెలిపింది. ‘మా సినిమా విషయంలో భూతద్దంలో చూసి మరీ తప్పులు వెతికి, హైలైట్ చేస్తున్నారు’ అంటూ దర్శకుడు ప్రవీణ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ‘ముఖం కనిపించకుండా నటించేందుకు ఏ హీరోయిన్ అంగీకరిస్తుంది? కథను నమ్మి అనుపమ ఇందులో నటించింది. ఆమె జాతీయ అవార్డు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆయన తెలిపారు.