calender_icon.png 13 September, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

13-09-2025 03:30:34 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే 

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న ఓపెన్ ఎస్.ఎస్.సి., ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్‌రావు, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, ఖజానా, తపాలా, పురపాలక, విద్యుత్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ ఎస్‌ఎస్ సి పరీక్ష నిర్వహణ కొరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఓపెన్ ఇంటర్ కొరకు జనకాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓపెన్ 10వ తరగతి కొరకు 145 మంది అభ్యర్థులు, ఓపెన్ ఇంటర్ కొరకు 63 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని, ఈ నెల 22 నుండి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

పరీక్షా కేంద్రాలలో వైద్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని, పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్. టి. సి. అధికారులు బస్సులను నడిపించాలని, తపాలా శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాలను తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో భద్రపరచాలని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కమిషనర్ ఉదయ్ బాబు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శేషరావు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.