09-05-2025 07:23:00 PM
మానుకోటలో వామపక్షాల నిరసన ర్యాలీ
మహబూబాబాద్,(విజయక్రాంతి): కర్రిగుట్టలో కాల్పులు తక్షణం విరమించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వామపక్షాల నాయకులు విజయ సారథి, ఆకుల రాజు, పాయం చిన్న చంద్రన్న, గౌని ఐలయ్య , కంచ వెంకన్న, బొర్ర ఆనంద్, మదార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అడవుల్లో నిక్షిప్తమైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి కేంద్రం ఆదివాసులపై దాడులకు దిగుతోందని విమర్శించారు. కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి, గుణగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హెచ్ లింగ్య నాయక్, భాస్కర్ రెడ్డి, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగా చారి, చొప్పరి శేఖర్, స్వామి బంధు మహేందర్ ,పొమ్మయ్య వెలుగు శ్రవణ్, లింగ్య నాయక్ ఆబోతు అశోక్, కేదాసు రమేష్, మంద శంకర్ పాల్గొన్నారు.