27-09-2025 07:31:13 PM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్,(విజయక్రాంతి): సద్దుల బతుకమ్మకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన కర్బలా మైదానంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను 9 రోజుల పాటు మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు.
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ చివరిరోజు సద్దుల బతుకమ్మ ను కర్బలా మైదానంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ వేడుకలకు కర్బలా మైదానం పరిసరాలలోని మహిళలే కాకుండా సికింద్రాబాద్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా మహిళలు వేలాదిగా వస్తారని చెప్పారు. బతుకమ్మకు వచ్చే మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా మొబైల్ జనరేటర్ లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
లైట్ల కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కూడా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పరిసరాలలో ఎక్కడ డ్రైనేజీ లీకేజీలు లేకుండా చూడాలని, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లోని బతుకమ్మ ఘాట్ లో బతుకమ్మ లను నిమజ్జనం చేస్తారని ఆ ప్రాంతంలో చెత్త, ఇతర వ్యర్ధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో అదనపు లైట్ ల ఏర్పటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని శాఖల అధికారులు కోఆర్డినేషన్ తో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.