09-05-2025 12:00:00 AM
లక్ష రూపాయల అప్పు కోసం మరో వ్యక్తి వద్ద జీతం పెట్టిన పిన్ని బాబాయిలు
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనంపై విజయక్రాంతి వార్తా కథనం
స్పందించిన బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు
నాగర్ కర్నూల్ మే 8 (విజయక్రాంతి) / బిజినపల్లి: అతి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అనాధ బాలుడిపై చిన్నాన్న, చిన్నమ్మలు తమ వక్ర బుద్ధిని ప్రదర్శించారు. వారు చేసిన అప్పులను తీర్చడం కోసం అదే గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద జీతం కుదిర్చారు.
చిట్టి చేతులతో ఆటలాడుకోవాల్సిన ఆ పసి బాలుడు పశువుల వద్ద పేడ ఎత్తడం, పొలం పనులు, ఇంటి పనులు చేయడం వంటి పరిమికి మించి బరువులను ఎత్తి వెట్టి చాకిరికి బలయ్యాడు. లక్ష రూపాయల అప్పు తీర్చేందుకు బడి మాన్పించి ఏడాది కాలంగా ఇంట్లో వెట్టిచాకిరి చేయించారు. చివరికి ఈ బరువైన పనులు చేయలేనంటూ సొంత గ్రామానికి పారిపోయినా విడవలేదు. ఇంటికెళ్లి మరీ ఈడ్చుకొచ్చి మళ్ళీ పనిలోకి పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న మేనత్త కుమారుడు మేన బావ చిన్నాన్న చిన్నమ్మలతో గొడవపడి చివరికి ఆ బాలుడిని రక్షించి ఇంటి వద్దే రక్షణ కల్పించాడు. ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వేడుకున్నాడు. ఆయనా అధికారులెవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తూ విజయక్రాంతితో మొరపెట్టుకున్నాడు.
దీంతో గురువారం విజయక్రాంతి వెబ్ పేజీలో ‘అప్పు తీర్చడం కోసం అనాధ బాలుడి వెట్టిచాకిరి‘ అనే శీర్షికన వార్త కథనాన్ని ప్రచురించగా జిల్లా చైల్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శ్రీశైలం బృందం స్పందించింది. గ్రామానికి వెళ్లి బాలుడుతో వివరాలు సేకరించారు. వివరాల్లోకి వెళితే.. బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన బోడ పెద్ద మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తన భార్య జంగమ్మ కూడా అనారోగ్య కారణాలతో కొద్దిరోజులకే మృత్యువాత పడింది.
దీంతో అనాధగా మారిన బాబును మేనత్త గాలమ్మ గంగారం గ్రామానికి తీసుకెళ్లి 5వ తరగతి వరకు చదివించింది. నాగర్ కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న బాలుడి చిన్నమ్మ చిన్నాన్న తాము చదివించుకుంటామంటూ తీసుకెళ్లారు. కానీ అదే గ్రామంలోని వెంకట్ రెడ్డి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఆ అప్పు చెల్లించడం కోసం ఆ 14ఏళ్ల బాలుడిని జీతానికి కుదీర్చారు.
చదువు కూడా మాన్పించి వెట్టి చాకిరి చేయించడంతో బరువు తట్టుకోలేక చిన్నప్పటి నుండి ఆశ్రయం కల్పించిన మేనత్త వద్దకు పారిపోయాడు. అయినా వినకుండా ఆ బాలుడుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మళ్ళీ వెట్టి చాకిరీ చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మేన బావ శివ ఆ బాలుడిని వెట్టి నుంచి విముక్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను వేడుకున్నాడు.