09-11-2025 12:01:47 AM
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమా ఈ నెల 14న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శనివారం జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి చిత్ర విశేషాలను తెలియజేశారు.
నేను కృష్ణవంశీ ‘మహాత్మ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. హిందీలో నేను చేసిన ఇండిపెండెంట్ మూవీ ‘లాగిన్’కు మంచి గుర్తింపు దక్కింది. అదే సినిమాను తెలుగులో ‘లేడీస్ అండ్ జెంటిల్ మేన్’ పేరుతో రీమేక్ చేశారు. అల్లు శిరీష్ హీరోగా ‘ఏబీసీడీ’, రాజ్‌తరుణ్‌తో ‘అహ నా పెళ్లంట’ వెబ్‌సిరీస్‌లను రూపొందించాను. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం కోసం చేసిన యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ప్రకటనలకు దర్శకత్వం వహించాను.
మన సమాజంలో మేల్ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో సినిమా రాలేదు. నా స్నేహితులు, బంధువులు కొందరు ఇలాంటి ఇష్యూస్ కారణంగా సమాజం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను దగ్గరగా చూశాను. ఈ కాన్సెప్ట్‌తోనే ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్ సిద్ధం చేశాను.
కథకు తగ్గ టైటిల్స్ ప్రేక్షకులకు ఎక్కువకాలం గుర్తుంటాయి. మనకు పెళ్లి కాగానే ‘సంతాన ప్రాప్తిరస్తు’ అని దీవిస్తారు. అలా ఈ టైటిల్ పెట్టాం.
నేనూ, రైటర్ కల్యాణ్ రాఘవ్ ఈ స్క్రిప్ట్‌ను కుటుంబంతో కలిసి చూసేలా ఉండాలని తీర్చిదిద్దాం. సమస్య గురించే ఎక్కువ చెబితే ఓవర్ డ్రామా అవుతుంది. కథ చెప్పడంలో కొంచెం హద్దు దాటినా బాగుండదు. అందుకే ఈ ఇష్యూను హ్యూమరస్‌గానే చెప్పాలనుకున్నాం. ఫెర్టిలిటీ ఇష్యూ మాట్లాడకూడని అంశం కాదు, సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య ఇది.
మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ గురించి హీరో విక్రాంత్ కూడా విని ఉన్నాడు. అందు కే కథ చెప్పగానే ఓకే చేశారు. హీరోయిన్‌గా తెలుగమ్మాయే బాగుంటుం దని చాందిని చౌదరిని తీసుకున్నాం. పెళ్లయిన మహిళగా నటించడానికి ఆమె ఏమాత్రం సందేహించలేదు. ఇలాంటి సమస్యను చెప్పడం నటిగా తన బాధ్యతగా భావించింది. తరుణ్ భాస్కర్ తన పాత్రను వీలైనంత మెరుగుపరిచి నటించారు.
హీరోకున్న లో స్పెర్మ్ కౌంట్ అనేది కథలో ప్రధానాంశం. ఈ ఇష్యూపై ఉన్న రెస్పెక్ట్, కథను చెప్పే విధానంలో డిగ్నిటీతోనే వెళ్లాం. ఇష్యూను ఎక్కడా ఫన్ చేయలేదు. ఇష్యూను ఎదుర్కొనే సందర్భాల్లో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేశాం. కాబట్టి సినిమా చూసేటప్పుడు సంతానం లేని దంపతులు, కుటుంబ ప్రేక్షకులు ఎక్కడా ఇబ్బందిపడరు.
కథలో చూపించిన మేల్ ఫెర్టిలిటీ ఇష్యూ ఇబ్బందిగా అనిపించలేదని సినిమా చూసిన కొందరు నిర్మాతలు చెప్పారు. యూఎస్‌కు ప్రింట్స్ పంపినప్పుడు అక్కడ ప్రింట్స్ కోసం పనిచేసే ఆపరేటర్స్ సినిమాను ఫ్యామిలీతో వెళ్లి చూస్తామని జెన్యూన్‌గా చెప్పడం ఆనందం అనిపించింది. ఇదే ప్రశంసలు రేపు ప్రేక్షకుల నుంచి కూడా వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే అంశాన్ని ఇకపై బహిరంగంగా చర్చిస్తారని అనుకుంటున్నాం. ఆ మార్పు తెచ్చేందుకు తొలి అడుగు మా సినిమా అవుతుందని ఆశిస్తున్నాం.