calender_icon.png 11 November, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుష్మాన్ ఖురానాను మన స్టార్స్ ఆదర్శంగా తీసుకోవాలి

11-11-2025 01:38:21 AM

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహించగా, షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు శ్రీధర్‌రెడ్డి, హరి ప్రసాద్‌రెడ్డి చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఈ కథను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. హీరోకు స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉంటుంది.

ఈ అంశం వల్ల తమ ఇమేజ్‌కు ఇబ్బందవుతుందని ఈ సినిమాను వాళ్లు చేయలేదు. ఆ తర్వాత కొత్త అబ్బాయి అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. అయితే, బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ఇలాంటి విభిన్న కథలతోనే స్టార్‌గా ఎదిగాడు. మనవాళ్లూ ఆయనలా ప్రయత్నించవచ్చు. ‘సామజవరగమన’ తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదే. ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. పాండమిక్ ముందు మనకు వరల్డ్ సినిమా తెలియదు. కరోనా టైమ్‌లో అందరం ఓటీటీల్లో డిఫరెంట్ జానర్స్ కంటెంట్ చూశాం. అలా ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్, ట్రెండ్ మారింది.

ఓ నాలుగేళ్ల క్రితమైతే నేను మా కుటుంబ సభ్యులకు ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్‌ను చూపలేకపోయేవాడిని. కానీ, ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూడగలుగుతున్నారు. ఇది సీక్రెట్‌గా చర్చించుకునే విషయం కాదు. ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతాన ప్రాప్తిరస్తు2’ చేయాలనుకుంటున్నాం. ‘సంతాన ప్రాప్తిరస్తు’ లాంటి చిన్న సినిమా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతోందంటే ట్రైలర్ ఆకట్టుకోవడం వల్లే. డిజిటల్ బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. అన్ని ఏరియాల్లో మెయిన్ థియేటర్స్ దొరికాయి. మా మూవీని యూఎస్‌లో దాదాపు 200 లొకేషన్స్‌లో పీపుల్ మీడియా విశ్వప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు” అన్నారు.

హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. నాలాగే తెలుగు ఐటీ సెక్టార్ వాళ్లకు మూవీస్‌లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇక్కడ సినిమా చేయడమూ సులువే. దాన్ని బిజినెస్ చేయడమే కష్టం. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవారితో అసోసియేట్ అయితేనే ఫైనాన్షియల్‌గా సేఫ్ కాగలం. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు త్వరలో డెబ్యూ అవార్డ్స్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా” అని తెలిపారు.