08-05-2025 12:39:25 AM
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ, మే 7: ‘పహల్గాంలో అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న ముష్కరులనే మట్టుబెట్టాం. మన సైనికులు ఉగ్రశిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు.’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. ‘పాకిస్థాన్‌కు మన సైనిక దళాలు గట్టి జవాబిచ్చాయి.
రాత్రికి రాత్రే మన సైనికులు చరిత్ర సృష్టించారు. అమాయక పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అశోకవనంలోకి వెళ్లినపుడు హనుమంతుడు ఏ నియమం పాటించాడో మేము కూడా అదే నియమం పాటిస్తున్నాం’ అని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మన త్రివిధ దళాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయన్నారు. అలాగే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.