08-05-2025 12:43:21 AM
న్యూఢిల్లీ, మే 7: పహల్గాం ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత భారత్ పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రశిబిరాలపై దాడులు చేసి ఆ దేశానికి నిద్రలేకుండా చేసింది. గతంలో ఉరి, పుల్వామా దాడులకు ప్రతిస్పందనగా భారత్ ఇలాంటి దాడులనే చేసింది. తాజాగా పహల్గాం ప్రతీకారాన్ని తీర్చుకుంది. పాకిస్థాన్, పాక్ అక్రమిత కశ్మీర్‌లో బుధవారం తెల్లవారుజామున 1.44గంటలకు భారత సాయుధ దళాలు ఈ దాడులను ప్రారంభించాయి.
జైషే మహమ్మద్ బహవల్పూర్ స్థావరం, లష్కరే మురిద్కే స్థావరంతో సహ తొమ్మిది ప్రదేశాలను భారత బలగాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఉగ్రచర్యలకు దీటుగా గతంలో చేసిన విధంగానే భారత బలగాలు తాజాగా ప్రతీకారం తీర్చుకుని భారత పౌరుల రక్షణకు భరోసాగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో 80 ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యం చెబుతోంది.
బాలాకోట్..2019
పూల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది సైనికులను చంపేశారు. ఈ దాడులను జైషే మహమ్మద్ చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది.
ఉరి..2016
2016 సెప్టెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరిలోని భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడి చేసి 19మందిని హతమా ర్చారు. పది రోజుల తర్వాత భారత సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరించి పీవోకేలోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రుక్స్ నిర్వహించి ఉగ్రవాదులను అంతం చేసింది.