10-05-2025 01:41:06 AM
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్ కాల్పులకు గురువారం ఓ అమాయక మహిళ బలయింది. ఉత్తర కశ్మీర్‌లోని యురి ప్రాంతంలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పులకు నర్గీస్ బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో మహిళ హఫీజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా కాల్పులకు తెగబడుతూనే ఉంది.
సరిహద్దు ప్రాంతాల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. పాక్ ప్ర యోగించిన అన్ని రకాల డ్రోన్లు, మిస్సైళ్లను భారత ఆర్మీ సమర్థతవంతంగా అడ్డు కుంది. పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
పదుల సంఖ్యలో అమాయకులు బలి
పహల్గాం ఉగ్రదాడి చోటు చేసుకున్నప్పటి నుంచి పాక్ రేంజర్లు సరిహద్దు వద్ద కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరపకూడదనే ఒప్పందం ఉన్నా కానీ దాన్ని మరిచి మరీ కాల్పులకు దిగుతున్నారు. ఇప్పటి వరకు పాక్ రేంజర్ల కాల్పుల్లో సైనికులతో పాటు పదుల సంఖ్యలో అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ రేంజర్లు మరింత రెచ్చిపోతూ కాల్పులకు దిగుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నారు. భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ ఎక్కడో ఓ చోట ప్రాణాలు పోతున్నాయి.