22-01-2026 01:54:44 AM
తుర్కపల్లి మండలంలోని 11 గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేసిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం టీఆర్పీకి అడ్డాగా మారుతున్నది. తుర్కపల్లి మండలంలోని 11 (ముల్కలపల్లి, సంగ్యా తండా, రాంపూర్, బాబుల నాయక్ తండా, పెద్ద తండా, రుస్తాపూర్, ధర్మారం, రామోజీనాయక్ తండా, గొల్లగూడెం, పల్లెపహాడ్, మొతిరాం తండా) గ్రామాల్లో టీఆర్పీ జెండాలను బుధవారం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎగురవేశారు. తెలంగాణలో జనాభాలో సుమారు 55 శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ, రాజకీయ అధికారంలో మాత్రం బీసీల వాటా 5 శాతం కూడా లేదని స్పష్టమైన లెక్కలతో తీన్మార్ మల్లన్న వివరించారు.
గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అనే రెడ్డిరావుల ఆధీనంలోని పార్టీలే అధికారంలో ఉన్నాయని, కానీ ఒక్కసారి కూడా బీసీలను పాలకులుగా చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలబోయన ఓదేలు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర నాయకులు బిక్కు నాయక్, కొమ్రిశెట్టి నర్సింహులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, బయ్య వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
టీఆర్పీలో భారీగా చేరికలు
టీఆర్పీలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, ఉపాధ్యక్షులుతో పాటు అనేక మంది కీలక నాయకులు టీఆర్పీలో చేరారు. అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.