31-01-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బంజారా సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతోందని, 10 శాతం రిజర్వేషన్లను తక్షణ మే అమలు చేయకపోతే పాలకులు రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు హెచ్చరించారు. శుక్రవారం విద్యుత్ సౌధలోని గిరిజన విద్యుత్ భవన్లో సంఘం 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో బంజారాలకు 12 చైర్మన్ పదవులు దక్కాల్సి ఉండగా, ప్రభుత్వం కుట్రపూరితంగా వాటిని ఐదుకు పరిమితం చేసిందన్నారు. గిరిజన జాతిని పరిపాలనలో భాగస్వామ్యం కాకుండా రాజకీయంగా అణిచివేసే ప్రయత్నాలను మాను కోవాలని డిమాండ్ చేశారు.
సంఘం ఆవిర్భవించిన 1953 నుంచి ఇప్పటివరకు బంజా రా సమాజ అభ్యున్నతి కోసం చేసిన పోరాటాలు, అందించిన సేవలను వక్తలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ తిలా వత్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. జగన్నాధ రావు రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ ఎస్పీ రవీంద్ర నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయక్, మాజీ కార్పొ రేటర్ సుమన్ రాథోడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.