calender_icon.png 23 November, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్చ్.. జొకోవిచ్

25-01-2025 12:00:00 AM

  1. తుది పోరుకు జ్వెరెవ్ అర్హత
  2. ఆదివారం సిన్నర్‌తో అమీతుమీ
  3. ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: ఆశలు అడియాసలయ్యాయి. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనుకున్న నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో తొలి సెట్ అనంతరం జోకో వైదొలిగాడు. అయితే ఈసారి ఓటమి కాకుండా గాయం రూపంలో అతడి కలను దూరం చేసింది.

తొలి సెట్‌ను అనంతరం మోకాలి గాయంతో జొకోవిచ్ ఆట నుంచి తప్పుకున్నాడు. దీంతో గతేడాది రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్ మరోసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అభిమానుల సమక్షంలో జొకోవిచ్ బాధాతప్త హృదయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు వీడ్కోలు పలికాడు.

ఇక సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ మరోసారి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సిన్నర్‌తో జ్వెరెవ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు.

సూపర్ సిన్నర్..

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సిన్నర్ (ఇటలీ) 7-6 (7/2), 6-, 6-2తో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్‌ను ఓడించాడు. కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్స్ సాధించిన సిన్నర్ మూడో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గిన సిన్నర్ ఆ తర్వాత ఫుంజుకొని వరుస సెట్లలో షెల్టన్‌పై వియాన్ని నమోదు చేసుకున్నాడు.

మ్యాచ్‌లో 8 ఏస్‌లు కొట్టిన సిన్నర్ 23 విన్నర్లు సంధించాడు. 7 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టినప్పటికీ 55 అనవసర తప్పిదాలతో షెల్టన్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీస్‌లో తొలి సెట్ అనంతరం జొకోవిచ్ మోకాలి గాయంతో వైదలగొడంతో జ్వెరెవ్‌కు వాకోవర్ లభించింది. తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6 (7/5)తో గెలుచుకున్నాడు. 

ఫైనల్ చేరాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన జొకోవిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ఇబ్బంది పడ్డాడు. క్వార్టర్స్‌లో అల్కరాజ్‌తో మ్యాచ్‌లోనే ఇబ్బందిగా కలిగిన జొకో సెమీస్‌లో తొలిసెట్ అనంతరం కోర్టులో నిలబడడం కష్టమైంది. దీంతో మ్యాచ్ రిఫరీకి తాను వైదొలుగుతున్నట్లు జొకో తెలపడంతో మ్యాచ్ ముగిసినట్లు ప్రకటించారు. 

సబలెంక x మాడిసన్ కీస్

నేడు జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకతో 19వ సీడ్ అమెరికాకు చెందిన మాడిసన్ కీస్ తలపడ నుంది. ఇప్పటికే రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సబలెంక హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో మాడిసన్ కీస్ బరిలోకి దిగుతోంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్‌లో కీస్ రన్నరప్‌గా నిలిచింది. ముఖాముఖి పోరులో సబలెంక 4-1తో కీస్‌పై ఆధిక్యంలో ఉంది.