calender_icon.png 10 September, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి పవనాలు!

08-09-2025 12:00:00 AM

మణిపూర్ అంటేనే అల్లర్లకు పెట్టింది పేరు. నిత్యం కుకీలు, మైతీల మధ్య ఘర్షణతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. తాజాగా మణిపూర్‌లో జాతీయ రహదారి విషయమై కుకీలు, జో కమ్యూనిటీ మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్రంలో కొంతమేర శాంతి పవనాలు వీచేలా చేసింది. రెండేళ్లుగా కుకీలు, మైతీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 260 మంది మృతి చెందగా.. చాలా మంది శరణార్ధి శిబిరాల్లో ఇప్పటికీ తలదాచుకుంటున్నారు.

మణిపూర్‌లో ప్రాదేశిక సమగ్ర తకు భంగం వాటిల్లకుండా శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడానికి చర్చల పరిష్కారం అవసరమని కుకీ తిరుగుబాటు గ్రూపులు, కేంద్ర ప్రభుత్వం భావించాయి. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో మణిపూర్‌లోని కీలకమైన జాతీయ రహదారి తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. మణిపూర్ జీవ నాధారామైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జో తెగలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇందులో భాగంగానే జాతీయ రహదారి స్వేచ్ఛా కదలిలకలకు అనుమతిస్తామని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరిం చింది. మణిపూర్‌లోని రెండు డజన్లకు పైగా ఉన్న కుకీ, జో, హ్మార్ తిరుగుబాటు గ్రూపులకు చెందిన రెండు సంయుక్త సంస్థలతో వివాదాస్ప దమైన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఎస్‌వో) ఒప్పందాన్ని పునరుద్ధరించారు. రాష్ట్రానికి కీలకమైన జాతీయ రహదారి మార్గంలో శాంతి కోసం భద్రతా దళాలతో కలిసి పనిచేస్తామని కుకీ-జో కౌన్సిల్ తెలిపింది.

తమ శిబిరాలను సంఘర్షణ ప్రాంతాల నుంచి దూరంగా తరలించడానికి అంగీకరించింది. అలాగే సమీపంలోని సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్ శిబిరాలకు ఆయు ధాలను తరలించేందుకు కూడా ఒప్పందం కుదిరింది. దీంతో నిత్యం జాతుల ఘర్షణతో అల్లాడిపోతున్న మణిపూర్‌లో ఈ కొత్త ఒప్పందం శాంతికి ఊతం కల్పించినట్లయింది. ఇక మణిపూర్ భౌగోళికంగా కొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతం అత్యంత సారవంతమైనది.

కేవలం 10 శాతం ఉన్న ఈ భూభాగంలోనే దాదాపు తొంబై శాతం ప్రజ లు నివసిస్తున్నారు. అయితే ఇక్కడ  హిందువులైన మైతీ తెగ జనాభా అత్యధికంగా 53 శాతం ఉంది. దీంతో రాజకీయాల్లో వీరిదే ప్రాబల్యం. మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు దాదాపు 30కి పైగా ఆదివాసీ తెగలున్నాయి. జనాభాలో అధికమైనప్పటికీ మైతీలకు ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో కొండప్రాంతాల్లో భూములు కొనలేరు.

ఈ నేప థ్యంలో కొండ ప్రాంతాల్లో నివసించే మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 2023 మే నెలలో హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని కుకీ, నాగా వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటినుంచి మొదలైన ఘర్షణలు నేటికి కొనసాగుతున్నాయి. హింసాత్మక చర్యలు, మహిళలపై లైంగిక దాడులకు తోడు మైతీ తెగలు రాష్ట్రంలో ఉన్న చర్చిలను ధ్వంసం చేయడం.. ఇలా నిత్యం ఘర్షణలతో అట్టుడుకిపోయింది.

దీంతో ఘర్షణలకు నైతిక బాధ్యత వహిస్తూ బీరేన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా జాతీయ రహదారి-2ను తెరిచేందుకు కుకీ, జో కమ్మూనిటీలు మధ్య కుదిరిన ఒప్పందం స్వాగతించాల్సిన విషయం. ఈ నెల 13న ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనకు ముందే శాంతి పవనాలు వీయడం బీజేపీకి బలం చేకూర్చినట్లయింది. మొత్తంగా శాంతిమార్గమే నిరసనలకు ముగింపు అని మరోసారి నిరూపితమైంది.