calender_icon.png 17 July, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన పెనుగొండ పాఠశాల

16-07-2025 12:00:00 AM

మహబూబాబాద్, జూలై 15 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు అరుదైన అవకాశం దక్కింది. దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్ కనెక్ట్ కార్యక్రమంలో పెనుగొండ పాఠశాలకు భాగస్వామ్యాన్ని కల్పించారు.

ఇది పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు గొప్ప ముందడుగు వేస్తుందని, పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్ వి. గురునాథరావు తెలిపారు. స్కూల్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ రూపొందించిన 10 ప్రత్యేక ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

ఇవి చదువుతో పాటు విద్యార్థుల్లో విజ్ఞానం, పరిశోధనా దృక్పథం, ఆవిష్కరణాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడతాయి. ఈ అవకాశాన్ని పెనుగొండ పాఠశాలకు తీసుకువచ్చేందుకు ముందుండి కృషి చేసిన భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు గురునాథరావు కు మండల విద్యాధికారి, పాఠశాల హెడ్మాస్టర్ యాదగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్  గురునాథరావు ఎస్ పి ఓ సి (సింగిల్ పాయింట్ కాంటాక్ట్) గా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారని ఆశ భావం వ్యక్తం చేశారు.