01-10-2025 12:00:00 AM
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
భద్రాచలం, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి) : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి పెరిగి నీటిమట్టం 50 అడుగులకు చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని, భద్రాచలం పట్టణం, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట అన్నారు.మంగళవారం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలను గోదావరి యొక్క వరద ఉధృతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలు భద్రాచలం పట్టణం యొక్క ప్రజల యొక్క భద్రత మా ముందున్న ప్రాధాన్యత అని, అందుకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు చెరువులు వాగులు, కాలువల వద్దకు వెళ్లకూడదని, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు గోదావరి పరిసర ప్రాంతాలలో, కరకట్ట, స్నాన ఘట్టాల వద్ద సరదాగా సెల్ఫీలు లేదా వీడియోలు షూట్ చేయడానికి వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని అన్నారు.
ప్రజలు నది తీరాలకు దూరంగా ఉండి అధికారులు అందించే సలహాలు, సూచనలు పాటించాలని, ఏమైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం భద్రాచలం 08743-232 444, వరదల కంట్రోల్ రూమ్ 7981219425, జిల్లా కలెక్టర్ కార్యాలయం పాల్వంచ 08744-241950, ఐటీడీఏ కార్యాలయం భద్రాచలం 7995268352 వరదల కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని అన్నారు.
ముంపు ప్రాంత ప్రజల కొరకు అధికారులు 24 గంటలు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని, వరద ఉధృతి ఎక్కువైతే ముంపునకు గురి అయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.గోదావరి కరకట్ట ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఎవరు కరకట్ట ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.