01-07-2025 07:30:40 PM
హైదరాబాద్: ప్రభుత్వం జీతాలు ఇస్తున్నప్పటికి కొందరు అధికారులు అవినీతికి కోరలు చపుతున్నారు. ఏసీబీ అధికారులు అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికి, రాష్ట్రంలో కొన్ని నెలలుగా అధికారులు అత్యాశతో లంచాలు తీసుకుంటు ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. తాజాగా, మరో ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లో మంగళవారం చోటు చేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో సునీత అనే మహిళ సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తుంది. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం సీనియర్ అసిస్టెంట్ సునితను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుంచి రూ.80 వేలు డిమాండ్ చేసింది. దీంతో అంతమొత్తం ఇచ్చుకోలేనని చేపట్టడంతో చివరకు రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. సునిత వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం బాధితుడు రూ.30 వేలు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సునీతను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారిణి నుంచి రూ.30 వేలు, బాధితుడి ఫైల్ ను స్వాధీనం చేసుకొని, సునీత కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపినట్లు తెలిపారు.