calender_icon.png 26 January, 2026 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలె

30-08-2024 01:55:13 AM

64,127 ఎకరాలలో సాగు 

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే  పెసర పంటను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పెసర  రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడాలన్నారు.  వానాకాలంలో 64,127 ఎకరాలలో పెసర పంట సాగుచేసినట్లు, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.

12 ప్రాంతాల్లో పంటకోతకు వచ్చిందని గుర్తించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఆ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేసి పంట ను కొనాలని సూచించారు. ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణ పేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు  అధికారులు సన్నాహాలు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.  రైతులు పెసర పంటకు మద్దతు ధర రూ. 8,682 పొందాలని సూచించారు. 

చేయూత పథాకానికి 90 కోట్లు విడుదల 

చేనేత చేయూత పథకానికి సంబంధించిన రూ. 90 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. దీంతో 36,133 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఈ పథకంలో చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు తమ వేతనంలో 8 శాతం వాటా జమ చేస్తే ప్రభుత్వం తన వాటాగా 16 శాతం పొదుపు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఈ మొత్తాలను వడ్డీతో సహా 3 సంవత్సరాల గడువు కాలం పూర్తికాగానే లబ్ధిదారులకు చెల్లిస్తారన్నారు. 

నూతన విధానాతో  అధిక దిగుబడి  

వ్యవసాయ రంగంలో నూతన విధానాలు తీసుకొస్తే రైతులు పెద్ద ఎత్తున పంట దిగుబడి తీస్తారని మంత్రి  నాగేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం నెక్లెస్‌రోడ్‌లో ఇండియా ఇంటర్నేషనల్ అగ్రిబిజినెస్ ఎక్స్ పో నిర్వహించిన సెమినార్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ, అనుబంధరంగాలలో చిన్న, మధ్యతర పరిశ్రమలకు ఉన్న అవకాశాలు, ప్రపంచ మార్కెట్లో పోటీపడే విధంగా  రైతులకు దిశానిర్ధేశం చేసేవిధంగా ఎక్స్ పో నిర్వహించడం అభినందనీయమన్నారు.   

 గాలిని కూడా కొనాల్సి వస్తుంది

చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలి కూడా కొనాల్సి వస్తుందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నెక్లెస్ రోడ్‌లో పీపుల్స్ ప్లాజాలో 16వ గ్రాండ్ నర్సరీ మేళా ఆల్ ఇండియా హార్టికల్చర్ షోను  ప్రారంభించి మాట్లాడారు. హార్టికల్చర్ ఆధ్వర్యంలో రూఫ్ గార్డెన్స్‌ను ప్రోత్సహిస్తున్నామ న్నారు. మేళాలో హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్  బాషా, తదితరులు పాల్గొన్నారు.