03-11-2025 07:51:49 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): బీసీ వర్గాల హక్కుల కోసం ప్రభుత్వం అమలు చేయాల్సిన 42% రిజర్వేషన్, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ లోపాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తంగళ్ళపల్లి మండలంలోని బీసీ సంఘాల ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు. బీసీలకు రాజ్యాంగపరమైన న్యాయం చేయాలంటే అన్ని విభాగాల్లో 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలులోకి రావాలని, గత ఏడు సంవత్సరాలుగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్లలో బీసీ రిజర్వేషన్ అమలు కానందున అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే బీసీ వర్గాల శ్రేయస్సు కోసం 3.42% సబ్ కేటగరైజేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ ఉక్కు సంఘం నివేదికలో పేర్కొన్న నిధులను ప్రభుత్వం విడుదల చేసి బీసీ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేయాలని వినతిపత్రంలో సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సంఘం అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్, కోడి అంతయ్య, కోడెం రమేష్, సుద్దాల కర్ణాకర్, భాస్కర్, బాబు, దేవేంద్ర చారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.