17-01-2026 04:10:20 AM
రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : వానాకాలంసీజన్‌లో కందుల పంటకు కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగ్వేరరావు తెలిపారు. రైతులకు లాభదాయక ధర కల్పించడం, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల వల్ల నష్టాలు నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని మంత్రి శుక్రవారంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీజన్‌లో రాష్ర్టవ్యాప్తంగా 4,99,393 ఎకరాల్లో కందులు సాగైందని, సుమారు 2,99,635 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని మంత్రి తెలిపారు.
కందులకు క్వింటాలుకు రూ. 8 వేల కనీస మద్దతు ధర నిర్ణయించగా, ప్రస్తుతం మార్కెట్ ధరలు రూ. 7,200 వరకు మాత్రమే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వానాకాలం 2025 -26కు గాను 1,71,310 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. కందుల కొనుగోళ్లు 27 డిసెంబర్ 2025 నుంచి ప్రారంభమై 26 మార్చి 2026 వరకు కొనసాగుతాయని, రాష్ర్టంలో మొత్తం 82 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా, ఇప్పటివరకు 13 కేంద్రాలు ప్రారంభించామన్నారు. రైతులు మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్మకుండా, సమీపంలోని టీజీ మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని కోరారు.