calender_icon.png 30 December, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయ మార్గాలు పెంచుకొని గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

29-12-2025 01:45:13 AM

- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, 

చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

సత్తుపల్లి, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): ఆదాయ మార్గాలు పెంచుకొని గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 1964 ప్రాంతంలోనే సత్తుపల్లి మండలం కిష్టారం, గంగారంలో హై స్కూల్ నిర్మాణ పనులు జరిగాయని, సత్తుపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తీసుకొచ్చిన కీర్తిని కాపాడుకుంటూ అంతకంటే ఎక్కువ కీర్తి సత్తుపల్లికి వచ్చేలా పని చేశానని తెలిపారు. శ్రీరామచంద్ర స్వామి దయతో గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుకుంటున్నాయని అన్నారు. జనవరి తర్వాత 34 నిమిషాలలో గ్రీన్ ఫీల్ హైవే ద్వారా ఖమ్మంకు చేరుకుంటామని మంత్రి తెలిపారు.

ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుగా సత్తుపల్లి ఉందని, అన్ని మండలాలకు దగ్గరలో ఉండేటట్లు సెంటర్ పాయింట్ చూసి కల్లూరు డివిజన్ చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామపంచాయతీ ఆదాయాలు పెంచుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. సత్తుపల్లి ప్రాంతానికి పూర్వం నుంచి మంచి పేరు ఉందని ఆ పేరును కాపాడుకోవాలని, నిబద్ధతతో రాజకీయాల్లో పని చేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, రాజకీయాల్లో క్యారెక్టర్ దెబ్బ తింటే ఎంత డబ్బు ఉన్న ఓడిపోతామని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంట కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.