calender_icon.png 2 October, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీలోని మొక్కలను సంరక్షించాలి:కలెక్టర్

02-10-2025 12:00:00 AM

 పమేలా సత్పతి 

ముకరంపురా, అక్టోబర్01(విజయక్రాంతి): నర్సరీలో పెరుగుతున్న మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్‌ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఎప్పటికప్పుడు నర్సరీ లో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు. పండ్ల మొక్కలను ఉమెన్స్ కాలేజీలో.. ఇతర చోట్ల పలు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పెరిగిన మొక్కలను వృథా చేయకుండా తప్పనిసరిగా నాటించాలని పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్ ఈఈ సంజయ్ కుమార్, ఏఈ సల్మాన్ తదితరులు ఉన్నారు. 

 స్థల పరిశీలన.. 

మున్సిపల్ వాహనాలు నిలుపుదల కోసం కోటి రూపాయలతో రేకుల షెడ్డు ఏర్పాటు చేసేందుకు హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రపుల్ దేశాయ్..మున్సిపల్ ఈఈ సంజయ్ కుమార్ కు పలు సూచనలు చేశారు.

 పనులు వేగవంతం చేయాలి 

బాలసదన్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి.. అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రి సమీపంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. రెండు కోట్లతో చేపట్టిన బాలసదన్ భవన నిర్మాణ పనులను నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తిచేసి భవనం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వారి వెంట మున్సిపల్ ఈ ఈ సంజయ్ కుమార్, తదితరులు ఉన్నారు. 

 వాహనాలకు పూజ 

విజయదశమి పండుగ పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో సబ్ స్టేషన్ వద్ద మున్సిపల్ రేకుల షెడ్డులో మున్సిపల్ వాహనాలకు పూజ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్.. అర్చకుల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్,మున్సిపల్ ఈఈ సంజయ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.