15-08-2025 12:54:47 AM
ఆదిలాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి ): పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం యాపల్ గూడ లోని పోలీస్ బేటాలియన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మామిడి మధుబన్ లో 600 మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడింది.
దీనికి జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ముఖ్య అతిథులుగా హాజరై బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తదితర అధికారులతో కలిసి మొక్కులు నాటి నీరు పోశారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలిసి అత్యవసర పరిస్థితుల్లో స్పందించగల శిక్షణ పొందిన వందమందితో ఎస్డిఆర్‌ఎఫ్ బృందం వరదల వంటి అత్యవసర సమయల్లో ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెమో ను తిలకించారు.
అదేవిధంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందిచే డెమో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ మాట్లాడుతూ అడవుల జిల్లాలో మరింతగా అటవీ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భావితరాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలంటే చెట్లను పెంచడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు.
అదేవిధంగా జిల్లాలో వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణంగా స్పందించేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలన్నారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండే బృందాలు వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బెటాలియన్ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.