calender_icon.png 11 January, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ధాన్యం పైసలు ఇప్పించండి సార్!

10-01-2026 01:42:50 AM

‘ఆరుగాలం కష్టపడి.. పండించి.. ధాన్యం మిల్లుకు అమ్మినం.. నీ కాళ్లు మొక్కుత.. మా ధాన్యం పైసలు ఇప్పించండి సార్!’ అంటూ ఓ రైతు తీవ్ర ఆవేదనతో తన తలను బాదుకుంటూ సీఐ కాళ్లపై పడి..కన్నీళ్లు పెట్టి మొరపెట్టుకున్నా ఆ కసాయి గుండెలు కనికరించలేదు. ‘మీ దగ్గర ఉన్న ఆధారాలేంటో చూపించండి.. మాట్లాడుదాం.. లేదులేదు.. మీరు డీఎస్పీ ఆఫీసుకు రండి..’ అంటూ అన్నదాతలను దబాయించారు. అక్కడికెళ్లినా.. ‘సంక్రాతి పండుగ వెళ్లే వరకూ ఆగండి. తర్వాత మాట్లాడదాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి’ అని ముప్పుతిప్పలు పెట్టారు. రైతుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు.. సమస్యను పరిష్కరించకుండా.. దాటవేసే ధోరణి అవలంబించారు.. ఇదేం తీరు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో శివసాయి రైస్ మిల్లు నుంచి.. డీఎస్పీ ఆఫీసు వరకు సాగిన ఈ ఉదంతంపై సర్వత్రా విస్మయం కలుగజేసింది. 

  1. తీవ్ర ఆవేదనతో తలను బాదుకుంటూ.. సీఐ కాళ్లు మొక్కిన రైతు
  2. తమ ధాన్యం పైసలు ఇవ్వాలని ఆందోళనకు దిగిన రైతులు.. అడ్డుకున్న పోలీసులు
  3. సూర్యాపేటలో శివసాయి రైస్ మిల్లు ఎదుట ఘటన

సూర్యాపేట, జనవరి 9 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో గల సంతోషిమాత ఫార్ బాయిల్ రైస్ మిల్‌కు గరిడేపల్లి, పెన్‌పహాడ్ మండలాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ధాన్యాన్ని అమ్మారు. అయితే మిల్లు యజమానికి ఆర్థిక పరమైన సమస్యలు రావడంతో అతనికి నేరేడుచర్ల పట్టణంలో ఉన్న వైష్ణవి మిల్లును తన మిల్లులోనే పనిచేస్తున్న శ్రీకాంత్, మురళి అనే ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, దానిని షూరిటీ పెట్టి లోన్ తీసుకుని, రైతులకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి మిల్లును వారి పేరుపై మార్చిన తదుపరి సదరు ఇద్దరు వ్యక్తులు యజమానిని ధిక్కరించి ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలియడంతో గడ్డిపల్లి మిల్లు యజమానితో పాటు శ్రీకాంత్, మురళి అనే ముగ్గురి భాగస్వామ్యంతో నడుస్తున్న సూర్యాపేటలో శివసాయి రైస్ ఇండస్ట్రీస్ వద్దకు శుక్రవారం రైతులు వచ్చి డబ్బులు అడుగుతూ ఆందోళనకు దిగారు.

‘20 రోజుల క్రితమే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. అసలు మాకు సంబంధమే లేదు’ అని వ్యవహరిస్తున్నారని అన్నదాతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలొ సూర్యాపేటలో మిల్లుకు తాళం వేయగా గురువారం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వేసిన తాళాలు పగులగొట్టి దౌర్జన్యంగా మిల్లు తెరిచారని రైతులు తెలిపారు. విషయం తెలిసి గడ్డిపల్లి మిల్లు యజమానిని తీసుకుని శివసాయి మిల్లు వద్దకు వచ్చి ఆందోళనకు దిగినట్లు తెలిపారు.                     

సీఐ కాళ్లు మొక్కిన రైతు

‘మేము అమ్మిన ధాన్యం డబ్బులు ఇవ్వాలి’ అని రైతులు శివసాయి మిల్లు వద్ద ఆందోళన దిగారు. దీంతో పోలీసులు వచ్చి రైతులనే అడ్డుకున్నారు. ‘మీ వద్ద ఉన్న ఆధారాలు తీసుక వస్తే మాట్లాడదాం.. వెళ్లండి’ అని దబాయించారు. తీవ్ర మనోవేదనలో ఉన్న ఓ రైతు ‘తన తలను బాదుకుంటూ ఈ నరకం అనుభవించలేం. మమ్ములను చంపేయండి. నీ కాళ్లు మొక్కుత.. మా పైసలు ఇప్పించండి. మా ధాన్యం డబ్బులు ఇప్పించండి సార్’ అంటూ అక్కడ ఉన్న సీఐ వెంకటయ్య రెండు కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు.

ఈ విషయం అక్కడ ఉన్న చూపరుల, విధుల్లో ఉన్న పోలీసుల కళ్లు చెమ్మగిల్లాయి. అయినా మిల్లు యజమానులు, పోలీసు ఉన్నతాధికారి కనికరించలేదు.  ఆందోళనకు దిగిన రైతులను అడ్డుకున్న పోలీసులు ‘తాళం వేసే ప్రసక్తి లేదు. మీరు డీఎస్పీ ఆఫీసుకు రండి. మాట్లాడదాం’ అని చెప్పడంతో అక్కడికీ రైతులు వెళ్లారు. అక్కడ కూడా ‘సంక్రాంతి పండుగ వెళ్లే వరకూ ఆగండి. తర్వాత మాట్లాడదాం.

మీరు వెళ్లండి’ అని చెప్పారంటూ పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఇంతమంది రైతులు వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం పోలీసులు స్పందించకపోవడం సరికాదంటూ ఆగ్రహించారు. తిరిగి గడ్డిపల్లి మిల్లు యజమానిని రైతులు వెంట తీసుకొని శివసాయి మిల్లు వద్దకు వెళ్లారు. ‘మిల్లులో మీరు పెద్ద భాగస్వామి.. మీరే తాళం వేయాలి’ అని రైతులు కోరారు.

దీంతో ‘రైతులకి నా వంతు న్యాయం చేస్తా’ అంటూ వెంటనే మిల్లుకు తాళం వేశారు. పూర్తి విషయం తేలే వరకూ మిల్లు తాళం తీయవద్దని ఆయన అందరి ముందే చెప్పడం గమనార్హం. రైతులకు తాము అమ్ముకున్న ధాన్యానికి సంబంధించిన డబ్బులు రాలేదు. దీంతో వారు మానసిక వేదనతో సతమతమవుతున్నారు.