21-08-2025 12:29:52 AM
మేడ్చల్, ఆగస్టు 20(విజయ క్రాంతి): ఎట్టకేలకు ఉప్పల్ నారపల్లి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యా యి. ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకుల కృషి వల్ల రోడ్డుకు మోక్షం లభించింది. వరంగల్ రహదారిలో రద్దీ దృష్ట్యా ఏడేళ్ల క్రితం ప్రభుత్వం ఫ్లైఓవర్ మంజూరు చేసింది. కాంట్రాక్టర్ మధ్యలోనే చేతులెత్తేయడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఈ దారి గుండా వెళ్లేవారు నరకం అనుభవించారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేశారు. ఈనెల 15న పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ రోడ్డును పరిశీలించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని, వినాయక చవితి లోపు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయ ని అన్నారు. ఆయన ప్రకటించినట్టుగానే వినాయక చవితికి ముందే పనులు ప్రారంభం అయ్యాయి.
మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గా ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు వజ్రేస్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి సైతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 11న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. గతంలో మంత్రి సైతం అధ్వానంగా తయారైన రోడ్డును పరిశీలించారు. మొత్తం మీద పనులు ప్రారంభం కావడం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.