calender_icon.png 26 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు కోసం ఆస్తుల తాకట్టు?

26-01-2026 02:56:03 AM

  1. అభ్యర్థుల గుండెల్లో గుబులు!

టికెట్ నీది.. ఆస్తి నాది....

చేవెళ్ల మున్సిపల్ పోరులో కలకలం రేపుతున్న కొత్త ఒప్పందాలు!

బీ-ఫామ్ కావాలా? ఆస్తి పత్రాలు రాసివ్వాలా?

చేవెళ్ల, జనవరి 25 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసా రిగా వేడెక్కింది. 12 విలీన గ్రామాలతో కలిసి ఏర్పాటైన ఈ మున్సిపాలిటీకి తొలి చైర్మన్ ఎవరనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం చైర్మన్ పీఠాన్ని జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది.

ఎంక్వైరీ కమిటీల హడావుడి 

అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం ఊపందుకోవడంతో బీ-ఫారమ్ కోసం డిమాండ్ పెరిగింది. అభ్యర్థుల గెలుపోటములపై ఆరా తీసేందుకు పార్టీ పెద్దలు ’ఎంక్వైరీ కమిటీలు’ వేయడంతో, టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఉన్న కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇందిరమ్మ పథకాలే పెట్టుబడిగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుండగా.. పదేళ్ల అభివృద్ధి, తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్‌ఎస్, అయోధ్య రామాలయం - మోదీ ఇమేజ్తో బీజేపీ సత్తా చాటాలని చూస్తున్నాయి.

ముగ్గురి మధ్యే పోటీ.. పీఠం ఎవరికి?

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిత్వం కోసం ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు.మంగలి కళ్యాణి యాదగిరి (BC), దేవర సమతా వెంకటరెడ్డి (రెడ్డి),మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి (రెడ్డి) లు ప్రధానంగా పోటీలో ఉన్నారు. రాజకీయ విశ్లేషణల ప్రకారం.. దేవర సమతా వెంకటరెడ్డి లేదా మర్పల్లి మాలతి కృష్ణారెడ్డిలలో ఒకరికి చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థుల పేర్లను ఇంకా గోప్యంగా ఉంచడం వెనుక వ్యూహం అంతుపట్టడం లేదు.

ఆస్తులు రాసుకున్నారట.. నిజమేనా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వింత చర్చాంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే ఎస్సీ, బీసీ అభ్యర్థులను తమ దారికి తెచ్చుకునేందుకు, కొంతమంది నేతలు సదరు అభ్యర్థుల పేరిట ఉన్న స్థిరాస్తులను ముందే తమ పేరిట రాసు కుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది స్థానికంగా పెను సంచలనంగా మారింది.అభివృద్ధిపై గంపెడు ఆశలతో ఉన్న చేవెళ్ల ప్రజలు.. ఈ త్రిముఖ పోరులో ఎవరికి పట్టం కడతారో చూడాలి. మున్సిపల్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.

చేవెళ్ల మున్సిపల్‌లో...

మొత్తం వార్డులు 18

మొత్తం ఓటర్లు 25,371

పోలింగ్ కేంద్రాలు 37

విలీన గ్రామాలు 12