calender_icon.png 11 January, 2026 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకశిల వెంచర్ లో ప్లాట్ల వివాదం

10-01-2026 08:19:54 PM

పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల దాడులు

ఇద్దరికీ గాయాలు

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా, ఉప్పల్ జోన్, ఘట్ కేసర్ సర్కిల్, పోచారం పరిధిలోని కోర్రెములలో ఏకశిల వెంచర్ భూవివాదం మరోసారి ముదిరింది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్ భూములపై కన్నేసిన కబ్జాదారులు అధికారుల అండతో సర్వే చేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ, కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను వదులుకోబోమని బాధితులు హెచ్చరిస్తున్నారు. భూ కబ్జాదారులు ఫ్లాట్ ఓనర్స్ మధ్య వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.

కొర్రెముల పరిధిలోని సర్వే నంబర్లు 739 నుండి 749 వరకు ఉన్న సుమారు 10 సర్వే నంబర్లలో 1985లోనే ఏకశిలా లేఅవుట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది మధ్యతరగతి ప్రజలు నేడు రోడ్డున పడ్డారు. తాజాగా ఈ భూముల్లో సర్వే నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ప్లాట్ ఓనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో ఈ విలువైన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

చట్టబద్ధంగా కొనుక్కున్న భూముల్లో అక్రమంగా సర్వే చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్లాట్ల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, అక్రమ కబ్జాలను సాగనివ్వమని భీష్మించుక కూర్చున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం  ఉన్నతాధికారులు స్పందించి, అమాయక ప్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.