17-09-2025 01:00:12 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో యూరియా బస్తాల కోసం ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న రైతులు రోడ్లపై ఉన్న గోతులతో ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశాల మేరకు పోలీసులు రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా పరిధిలోని డోర్నకల్, కురవి తదితర మండలాల్లో రహదారులపై ఏర్పడ్డ గోతులను పోలీసులు ట్రాక్టర్లతో మట్టి తెచ్చి వాటిని పూడుస్తున్నారు.
అలాగే చిన్నపాటి మరమ్మతులను కూడా స్వయంగా పోలీసులే నిర్వహిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు రోడ్లకు అనేకచోట్ల గోతులు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటీవల పలుచోట్ల రైతులు రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించడం, తీవ్రంగా గాయపడ్డ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ పట్టించుకోకపోవడంతో పోలీసులే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.