15-12-2025 07:01:50 PM
ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్
అర్మూర్ (విజయక్రాంతి): ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. సోమవారం అర్మూర్ ఏసీపీ కార్యాలయంలో అర్మూర్ డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17న జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
ప్రధానంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతి సమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు.
అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించిన పోలింగ్ బూతు యందు సక్రమమైన విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏ.సి.పి జె.వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి.సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సి.ఐ కె.శ్రీధర్ రెడ్డి, భీంగల్ సిఐ పి.సత్యనారాయణ గౌడ్, బాల్కొండ ఎస్ఐ కె.శైలేందర్, నందిపేట్ ఎస్ఐ జి.శ్యామ్ రాజ్, వేల్పూర్ ఎస్ఐ బి.సంజీవ్, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్, మెండోరా ఎస్ఐ సుహాసిని, భీంగల్ ఎస్.ఐ కె.సందీప్, మోర్తాడ్ ఎస్.ఐ బి.రాము కమ్మర్పల్లి ఎస్.ఐ జి.అనీల్ రెడ్డి, ఏర్గట్ల ఎస్ఐ పి. రాజేశ్వర్, మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.