calender_icon.png 17 January, 2026 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫొటోలకు పోజులివ్వడం రేవంత్‌రెడ్డికే చెల్లింది

17-01-2026 02:57:16 AM

  1. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతా?

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): వంట వండి వడ్డనకు అన్ని సిద్ధం చేస్తే.. గంటె పట్టుకొని ఫొటోలకు పోజులివ్వడం రేవంత్ రెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియా మకపత్రాలు రెడీమేడ్‌గా తయారై ఉన్నాయని విమర్శించారు. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. పాలన మీద, ప్రాజెక్టుల మీద పెడితే ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని హరీశ్‌రావుఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శనమని, ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారిందని విమర్శించారు.

లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సీ.రామచంద్రారెడ్డి పేరు ప్రా జెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమేనని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆ ర్‌ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.