01-07-2025 06:37:50 PM
హైదరాబాద్: గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Powerpoint Presentation) జరిగింది. తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కులు కాపాడటంలో సాంకేతికంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పదేళ్లపాటు చూశారని, రాష్ట్ర నీటిహక్కులను వాళ్లు కాపాడుతారని అందరూ భావించారని చెప్పారు. కానీ కాపాడుతారని భావించిన వాళ్లే రాష్ట్రానికి నష్టం చేశారని సీఎం మండిపడ్డారు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, 68 శాతం జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంలో అభ్యంతరం లేదని 2015లోనే సంతకం చేశారన్నారు.
2015లో కేసీఆర్, హరీశ్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మారణశాసనంగా మారిందని విరుచుకుపడ్డారు. కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే.. తెలంగాణకే ఎక్కువ దక్కాలని, కానీ కేటాయించిన 299 టీఎంసీలు కూడా వాడుకోలేదని పరిస్థితి తెచ్చారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 299 టీఎంసీలు వాడుకోలేని పరిస్థితి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రాజెక్టులను గత పాలకులు పదేళ్లపాటు పట్టించుకోలేదని, ఏపీ మాత్రం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను నీటిని తరలించుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో రూ.38 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్లను పక్కన పెట్టి కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టారని విమర్శించారు.
రూ.లక్ష కోట్లు వేచించి కట్టిన ప్రాజెక్టుతో 168 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని రేవంత్ రెడ్డి తెలిపారు. మళ్లీ 168 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.7 వేల కోట్ల కరెంట్ బిల్లు ఖర్చయ్యిందని, అందులో మళ్లీ 112 టీఎంసీల నీళ్లు వృథాగా కిందకు వదిలారని వ్యాఖ్యానించారు. చచ్చిన పార్టీని బతికించేందుకు మళ్లీ జలాల సెంటిమెంట్ ను ఎత్తుకున్నారని, ఏపీని బూచీగా చూపి పార్టీని పునరుజ్జీవం చేసుకునేందుకు ఫామ్ హౌస్ లో క్షుద్రపూజలు చేశారని సీఎం వ్యంగ్యంగా మాట్లాడారు. గోదావరిలో వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని కేసీఆర్ మాట్లాడారని, కేటాయింపులు ఉన్న 968 టీఎంసీల నీటిని వాడుకోకుండా వృథాగా పోతున్నాయని ఎలా అంటారు..? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.