calender_icon.png 2 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్ కామెడీ టైమింగ్‌ను రాజాసాబ్‌లో ఎంజాయ్ చేస్తారు

17-06-2025 12:00:00 AM

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజాసాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్‌దత్, అనుపమ్‌ఖేర్, సముద్రఖని, వీటీవీ గణేశ్, తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ రాబోతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “మీ ప్రేమకథా చిత్రమ్, భలేభలే మగాడివోయ్ సినిమాలు నాకు ఇష్టం.. అలాంటి సినిమా చేద్దాం..’ అని ప్రభాస్ నాతో చెప్పారు. నేను ఒక లైన్‌గా కథ చెప్పా. ప్రభాస్‌కు ఒక ఇమేజ్ ఉంది. ఆయన కామెడీ ఎలా చేస్తాడని చాలా మంది డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ఎందుకు ఈ కథ రాయలేనని గట్టిగా నిర్ణయించుకుని చేసిన స్క్రిప్ట్ ఇది.

ప్రభాస్‌ను అభిమానులు ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే వెయ్యి రెట్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారాయన. అభిమానులను ఆయన నేరుగా కలవకపోవచ్చు కానీ బెస్ట్ మూవీస్ ఇచ్చేందుకు రాత్రింబవళ్లు ఎంత తపన పడతారో నేను కళ్లారా చూశాను.  ప్రభాస్‌లో ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అది ఈ మూవీలో ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్‌కు ముగ్గురు హీరోయిన్స్‌తో ఒక కలర్‌ఫుల్ సాంగ్ ఉంటుంది.

ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఆయన డ్యాన్సులను కూడా అంతా ఎంజాయ్ చేయబోతున్నారు” అన్నారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “రాజాసాబ్’ మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కోసం మరే సినిమాకు నిర్మించని బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం.

ప్రేక్షకుల అంచనాలన్నీ అందుకుంటూ, అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందీ సినిమా” అన్నారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. “డిసెంబర్ 5న ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టిస్తుంది” అని చెప్పారు. నిర్మాత కృతి ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు. 

తండ్రి పండ్లు అమ్మినచోటే మారుతి కటౌట్ 

రాజాసాబ్ టీజర్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ మారుతి సోషల్‌మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన జర్నీ గురించి ఇందులో రాసుకొ చ్చారు. “మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్. ఒకానొక సయయంలో ఇక్కడే మా నాన్న చిన్న దుకాణం పెట్టుకొని అరటిపళ్లు అమ్మేవారు. అప్పట్లోనే సినిమాల్లో అడుగుపెట్టాలని ఆశపడేవాన్ని.

ఆ థియేటర్‌లో విడుదలయ్యే హీరోల బ్యానర్లు నేను సిద్ధం చేసేవాన్ని. మన పేరు కూడా ఇక్కడ చూడాలి కలలు కనేవాన్ని. ఈరోజు అదే కాంప్లెక్స్ వద్ద నిల్చొని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తుచేసుకుంటే జీవితం పరిపూర్ణమైందనిపిస్తోంది. పాన్‌ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకుమించి ఏం కావాలి? నాన్న ఉండుంటే ఎంతో గర్వపడేవారు. ఆయన్ను నేనెంతో మిస్ అవుతున్నా” అని మారుతి పోస్ట్‌లో పేర్కొన్నారు.