calender_icon.png 18 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల నిధులు.. టీఎంసీ లూటీ

18-01-2026 01:23:13 AM

మమత పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు

వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం

జెన్ జీ తరం కూడా మా వెంటే ఉంది..

మాల్దా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

కోల్‌కతా, జనవరి 17: పేదలకు అందాల్సిన నిధులను టీఎంసీ ప్రభుత్వం లూటీ చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా టౌన్ రైల్వేస్టేషన్‌లో శనివారం ఆయన హౌరాణొ గువాహటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. అలాగే  రూ.3,250 విలువైన రైల్వే, రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. మాల్దాలో పరిశ్రమలు లేకపోవడం వల్ల స్థానిక యువత వలస వెళ్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాల్దా మామిడి రైతులకు మేలు చేసే విధంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో అధికార మార్పు రావాలని, అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే కావాలని ఆకాంక్షించారు.

సీఎం మమతా బెనర్జీ పాలనతో బెంగాల్ ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని మండిప డ్డారు. పథకం ద్వారా దేశంలోని పేద ప్రజలు ఉచిత వైద్యం పొందుతుంటే, బెంగాల్ ప్రభుత్వం పేదలకు ఆ అవకాశం ఇవ్వడం లేదని నిప్పులుచెరిగారు. అక్రమ చొరబాట్ల వల్ల బెంగాల్ భౌగోళిక పరిస్థితులు, సంసృ్కతి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కొన్ని ప్రాంతాల్లో బెంగాలీ భాష కూడా మారిపోతోందని స్థానికులు చెబుతున్నారని వాపోయారు. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తున్నాయ ని, బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జెన్ జీ యువతకు బీజేపీ అభివృద్ధి నమూనాపై పూర్తి నమ్మకం ఉందని, రాబో యే ఎన్నికల్లో ఈ తరం యువత బీజేపీకే మద్ద తు ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పుడు బీజేపీ హవా నడుస్తున్నదని, అందుకు ఉదాహరణే తాజాగా మహారాష్ట్ర, కేరళ మున్సిపల్ ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ తొలిసారిగా మేయర్ పీఠాన్ని దక్కించుకుందని గుర్తుచేశారు.