calender_icon.png 12 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా ప్రక్క దారి పట్టకుండా పటిష్టమైన చర్యలు

11-08-2025 10:27:48 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో పంటల సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని, యూరియా ప్రక్క దారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా వ్యవసాయ అధికారి భుక్య ఛత్రు నాయక్, జిల్లా ఉద్యానవన అధికారి అనితలతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యానవన- పట్టు పరిశ్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పంట సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత సృష్టించడం, యూరియాను ప్రక్క దారి పట్టించడం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

యూరియా అధికంగా కొనుగోలు చేసే వారిపై దృష్టి సారించాలి

యూరియా అధిక మొత్తంలో కొనుగోలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం జిల్లాలో చేస్తున్న పత్తి సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, అంచనా పంట దిగుబడి కంటే కొనుగోలు అధికంగా జరుగుతుందని, ఈ క్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు పంట సాగు, దిగుబడి సంబంధించి రిజస్టర్లు సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ నెల 31లోగా వరి ధాన్యం సాగు ప్రారంభించాలని, సాగు ప్రారంభం కాని పక్షంలో ఇతర పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పత్తి పంట సాగులో అంతర పంటగా మునగ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, మునగ అంతర పంట సాగుకు ఉపాధి హామీ పథకం క్రింద గుంతలు, మొక్కలు నాటడం, నీటి సరఫరాకు సంబంధించి నగదు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 70 ఎకరాల నుండి 300 ఎకరాలకు పెరిగిందని, అవసరం ఉన్న చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మొక్కజొన్నతో పాటు కందులు, పెసలు, మినుముల పంట సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ విస్తీర్ణంలో నమోదు చేసుకున్న విస్తీర్ణం కంటే సాగు విస్తీర్ణం తక్కువగా ఉందని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పోడు భూములలో ఆయిల్పామ్ పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. 

వరి ధాన్యం పంట కోత నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభించేందుకు అనుగుణంగా సాగు చేసేలా రైతులకు వివరించాలని, తద్వారా డిసెంబర్ నెలలో అకాల వర్షాల నుండి పంటను కాపాడుకునేందుకు వీలు ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రైతు భీమా పథకంలో రైతుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతు భీమా లబ్దిదారులకు జాతీయ కుటుంబ సంక్షేమ పథకం క్రింద 18-50 వయస్సు వరకు పరిహారం వస్తున్నందున, లబ్దిదారులు సంబంధిత తహశిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మ్యాట్రిక్స్ సి.ఈ.ఓ. ఉదయ్కుమార్, సంబంధిత అధికారులు, మ్యాట్రిక్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.